- స్పోర్ట్స్ మినిస్టర్ వాకిటి శ్రీహరి
మక్తల్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో సరికొత్త క్రీడా పాలసీ తీసుకొచ్చామని, దీంతో సుమారు రూ.25 వేల కోట్ల పెట్టుబడులు క్రీడారంగంలోకి వచ్చాయని స్పోర్ట్స్ మినిస్టర్ డాక్టర్ వాకిటి శ్రీహరి తెలిపారు. నారాయణపేట జిల్లా మక్తల్ లో సీఎం కప్ రెండో ఎడిషన్‌లో భాగంగా శుక్రవారం రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ వినీత్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 33 జిల్లాల నుంచి పురుషులు–మహిళల విభాగాల్లో 66 జట్లు పాల్గొంటున్నాయని తెలిపారు.
దాదాపు 1500 మందికి పైగా క్రీడాకారులు, కోచ్‌లు, పీఈటీలు, సిబ్బంది హాజరవుతున్నారని చెప్పారు. గతంలో రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్లే కేటాయించేవారని, ఈసారి బడ్జెట్‌లో క్రీడా శాఖకు రూ.1600 కోట్లు కేటాయిస్తున్నామని వెల్లడించారు. స్పోర్ట్స్ రిజర్వేషన్‌ను 2 శాతం నుంచి 5 శాతానికి పెంచే దిశగా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
ఇప్పటివరకు 120 మంది అంతర్జాతీయ క్రీడాకారులు విదేశీ టోర్నీలకు వెళ్లేందుకు రూ.600 కోట్ల వరకు ఖర్చు చేశామని, ఒలింపిక్స్‌లో పతకం సాధించిన వారికి రూ.3.50 కోట్ల ప్రోత్సాహక బహుమతి అందిస్తున్నామని తెలిపారు. మక్తల్ గ్రౌండ్‌ను రూ.25 కోట్లతో స్టేడియంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. అంతకుముందు హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ ఫొటో వద్ద పూజలు నిర్వహించి, క్రీడాజ్యోతి వెలిగించారు.
నల్గొండ, నిర్మల్ జట్లు తొలి రోజు తలపడ్డాయి. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వర్ల విజయ్ కుమార్, జిల్లా క్రీడా యువజన శాఖ అధికారి వెంకటేశ్ శెట్టి, మున్సిపల్ చైర్ పర్సన్ వాకిటి మానస హనుమంతు, వైస్ చైర్ పర్సన్ శైవిరెడ్డి, మార్కెట్ చైర్ పర్సన్ రాధా లక్ష్మారెడ్డి, వైస్ చైర్పర్సన్ గణేశ్‌కుమార్ పాల్గొన్నారు.
